Uttar Pradesh: తన భర్తే అనుకుని అతనిని ఇంటికి తీసుకెళితే.. షాక్!
- ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- పదేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ భర్త
- ఇటీవల జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద చిరిగిన దుస్తుల్లో తచ్చాడుతున్న వ్యక్తి తన భర్తేనని పొరబడ్డ మహిళ
- ఇంటికి తీసుకొచ్చి పుట్టుమచ్చలు పరిశీలిస్తే అతడు తన భర్త కాదని తేలిన వైనం
ఆమె కళ్లెదురుగా ఓ వ్యక్తి.. చిరిగిన దుస్తుల్లో మతిస్థిమితం లేకుండా తిరుగాడుతున్నాడు. పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త అతడే అని భ్రమపడిందో మహిళ. సంబరపడిపోతూ అతడిని ఇంటికి తెచ్చుకున్నాక అసలు విషయం తెలిసి అవాక్కయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన.
బలియా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మోతీచంద్ వర్మ, జానకీదేవికి 21 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్నేళ్లకు మోతీచంద్ మతిస్థిమితం కోల్పోవడంతో అతడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం నేపాల్ తీసుకెళ్లారు. అక్కడే అతడు తప్పిపోయాడు. ఆ తరువాత అతడి జాడ కనుక్కుకునేందుకు జానకీదేవి, ఇతర కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
అయితే, శనివారం జానకీదేవికి జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద నిరాశ్రయుడైన ఓ వ్యక్తి కనిపించాడు. చిరిగిన దుస్తులతో మతిస్థిమితం లేనట్టు ఉన్న అతడిని చూసి తన భర్తే అనుకుని జానకీదేవి పొరబడింది. సంబరపడుతూ అతడిని ఇంటికి తెచ్చుకుంది. కానీ, అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పుట్టుమచ్చలను పరిశీలించగా అతడు తన భర్త కాదని తెలియడంతో కంగుతింది. చివరకు అతడికి క్షమాపణలు చెప్పి, జరిగిన విషయాన్ని గ్రామపెద్ద దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణ జరపగా, ఆ వ్యక్తి మరో గ్రామానికి చెందిన రాహుల్ గా నిర్ధారణ అయింది. దాంతో అతని కుటుంబీకులకు రాహుల్ ను అప్పగించారు.