Godavari: గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి... సముద్రంలోకి భారీగా నీటి విడుదల
- ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
- కాటన్ బ్యారేజి వద్ద 15.9 అడుగుల నీటిమట్టం
- సముద్రంలోకి 16.14 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
- తెలంగాణలో వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోందన్న అల్లూరి జిల్లా కలెక్టర్
గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉద్ధృతి పెరుగుతుండడం పట్ల గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం 15.9 అడుగులకు చేరుకుంది.
భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 16.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పంట కాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వరద పరిస్థితులపై అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించారు. తెలంగాణలో భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలో గోదావరికి వరద పెరుగుతోందని వెల్లడించారు. ఇప్పటివరకు ముంపు ప్రాంతాల నుంచి 20 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించామని వివరించారు. వరద ప్రాంతాల్లో 20 వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.