Undavalli Arun Kumar: మోదీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదు: ఉండవల్లి అరుణ్‌కుమార్

undavalli arun kumar press meet in rajahmundry

  • వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న ఉండవల్లి
  • టీడీపీ, వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని విమర్శ
  • ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్నికలకు ముందు అయినా మాట్లాడాలని వ్యాఖ్య
  • వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళితే ఆ వ్యవస్థ రద్దు అవుతుందన్న మాజీ ఎంపీ

టీడీపీ, వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ఏపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాజమండ్రిలో మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు... బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఎన్నికలకు ముందు అయినా మాట్లాడాలని సూచించారు.
 
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు అవుతున్నా విభజన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి పెంచాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేయాలని అన్నారు. ‘‘అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు.

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అంటున్నారని, అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడబోమని ఎందుకు అంటున్నారని నిలదీశారు.

ఇటీవల చర్చనీయాంశమైన వాలంటీర్ల వ్యవస్థపైనా ఉండవల్లి స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళితే... ఆ వ్యవస్థ రద్దు అవుతుందని చెప్పారు. టీడీపీ, జనసేన ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News