China: అరుణాచల్ ఆటగాళ్లకు చైనా ప్రత్యేక వీసాలు.. భారత్ నిరసన
- స్టేపుల్డ్ వీసాలు జారీ చేసిన డ్రాగన్ కంట్రీ
- అరుణాచల్ పౌరులకు వీసా అక్కర్లేదని చెప్పడమే..
- నిరసనగా జట్టు టూర్ ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా.. తాజాగా మరోమారు తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. రాష్ట్ర ఆటగాళ్లకు ప్రత్యేకంగా స్టేపుల్డ్ వీసాలను జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ పౌరులు చైనాలో పర్యటించేందుకు వీసా అక్కర్లేదని ఈ చర్యతో స్పష్టం చేసింది. చైనా తీరుపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. జట్టు పర్యటనను రద్దు చేస్తూ నిరసన తెలిపింది. భారత పౌరులకు జారీ చేసే వీసాల విషయంలో చైనా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ మండిపడ్డారు.
ఏం జరిగిందంటే..
ప్రపంచ యూనివర్సిటీల స్థాయి వుషు ఆటల పోటీలలో పాల్గొనేందుకు భారత జట్టు చైనాకు వెళ్లనుంది. ఇందుకోసం భారత వుషు జట్టు ఆటగాళ్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, భారత జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు చైనా స్టేపుల్డ్ వీసాలను మంజూరు చేసింది. ఆ ముగ్గురు ఆటగాళ్లు అరుణాచల్ ప్రదేశ్ పౌరులు కావడమే దీనికి కారణం. అరుణాచల్ పౌరులకు చైనాలో పర్యటించేందుకు వీసా అక్కర్లేదని ఈ చర్యతో స్పష్టం చేసింది. చైనా నిర్ణయంపై మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం ఏకంగా జట్టు పర్యటననే రద్దు చేసింది.
స్టేపుల్డ్ వీసా అంటే..
వీసా మీద ముద్ర వేయకుండా ఓ పేపర్ మీద స్టాంప్ వేసి, దానిని వీసాకు స్టేపుల్ చేస్తారు. దీని ఉద్దేశం.. చైనాలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని, అక్కడి పౌరులకు చైనాలో పర్యటించేందుకు ప్రత్యేకంగా వీసా అక్కర్లేదని చెప్పడమే!