cab driver: 13 గంటలు క్యాబ్‌లో తిరిగి.. డబ్బులివ్వమంటే వాగ్వాదానికి దిగిన మహిళ
- గురుగ్రామ్‌లో రాత్రి పూట ఓలా ద్వారా క్యాబ్ బుక్ చేసిన మహిళ
- మరుసటి రోజు ఉదయం గం.11 వరకు క్యాబ్ లో చక్కర్లు
- రూ.2,000 చెల్లించాలన్న డ్రైవర్ తో వాగ్వాదం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన క్యాబ్ డ్రైవర్
- పోలీసులతోనూ వాగ్వాదానికి దిగిన మహిళ
గురుగ్రామ్ సైబర్ సిటీలో ఓ మహిళ పోలీసులు, క్యాబ్ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ క్యాబ్ లో 13 గంటల పాటు ప్రయాణించి, డ్రైవర్ కు చెల్లించాల్సిన రూ.2000 ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వాగ్వాదం మొదలైంది. జ్యోతి అనే మహిళ ఓలా యాప్ ద్వారా రాత్రి సమయంలో మేదాంత ఆసుపత్రి సమీపంలో క్యాబ్ ను బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపాడు. ఆ క్యాబ్ లో రాత్రింతా మాత్రమే కాదు.. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తిరిగింది.
ఆమె అదే పనిగా తిప్పడంతో క్యాబ్ డ్రైవర్ సరైన గమ్యస్థానం కోసం గట్టిగా అడిగాడు. ఆమె అడ్రస్ చెప్పడంతో అక్కడ దించిన తర్వాత డబ్బులు చెల్లించాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. పైగా తనను డబ్బులు అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని హెచ్చరించింది. రాత్రంతా తిప్పడంతో రూ.2,000 ఛార్జీ అయిందని, దానిని చెల్లించాలని అతను పట్టుబట్టాడు.
జ్యోతి డబ్బులు ఇవ్వకపోవడంతో దీపక్ గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలా తిప్పుతుండటంతో తాను మొదటి నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నానని, కాని ఫోన్ పే చేస్తానని నమ్మబలికిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జ్యోతిని విచారించగా ఆమె వారితోను దురుసుగా ప్రవర్తించింది. ఈ ఘటనలకు సంబంధించి ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.