Narayana Murthy: కరీనా కపూర్ తన అభిమానులను కనీసం పట్టించుకోలేదు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

kareena kapoor ignored fans says infy narayana murthy

  • ఓసారి విమానంలో తన పక్క సీట్లో కరీనా కూర్చున్నారన్న నారాయణ మూర్తి
  • అభిమానులు వచ్చి పలుకరిస్తే పట్టించుకోలేదని విమర్శ
  • తాను ఆశ్చర్యపోయానని వెల్లడి
  • ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారని భర్తకు సుధామూర్తి కౌంటర్
  • ఫ్యాన్స్‌తో బహుశా ఆమె విసిగిపోయి ఉండొచ్చని వ్యాఖ్య

ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా నారాయణమూర్తి సుప్రసిద్ధులు. 10 వేల రూపాయలతో ఇన్ఫోసిస్‌ను స్థాపించి.. ఓ సామ్రాజ్యంగా మలిచారు. తన సుదీర్ఘ అనుభవసారాన్ని పలు వేదికలపై తన అర్ధాంగి సుధామూర్తితో కలిసి ఆయన పంచుకుంటుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్‌‌ విషయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్ధాంగి సుధామూర్తి మధ్య చిన్నపాటి మాటల (సరదా) యుద్ధమే సాగింది. కరీనా కపూర్‌‌ని నారాయణ మూర్తి తప్పుబట్టగా.. ఆయనతో సుధామూర్తి విభేదించారు. ఇటీవల ఓ చర్చాకార్యక్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆమధ్య నారాయణ మూర్తి దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నారాయణమూర్తి.. కరీనా గుర్తించి ప్రస్తావించారు. ‘‘ఓసారి నేను లండన్‌ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్‌ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి ఆమెను పలకరించారు. కానీ ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

వెంటనే జోక్యం చేసుకున్న సుధామూర్తి.. నారాయణ మూర్తితో విభేదించారు. ‘‘ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉండొచ్చు. ఓ సాఫ్ట్‌వేర్‌ వ్యక్తి, కంపెనీ ఫౌండర్‌ అయిన నారాయణ మూర్తికి 10 వేల మంది అభిమానులు ఉంటారేమో! కానీ సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్‌ ఉంటారు కదా’’ అని కరీనాకు మద్దతుగా మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేశారు.

తన మాటలకు నారాయణ మూర్తి మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే.. తిరిగి చూపించడమనేది చాలా ముఖ్యం’’ అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




Narayana Murthy
Kareena Kapoor
Sudha Murthy
infosys
Bollywood

More Telugu News