Nitin Gadkari: ఒక్కో ఓటర్‌కు కిలో మటన్ పంచినప్పటికీ ఓడిపోయా: నితిన్ గడ్కరీ
- ఎంఎస్‌టీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి
- నాయకులు ప్రజల నమ్మకాన్ని, ప్రేమను సంపాదిస్తే చాలునని వ్యాఖ్య
- డబ్బులు పంచడం, తాయిలాలు ఇచ్చినంత మాత్రాన ఓటేయరన్న గడ్కరీ
గతంలో తాను ఓ ఎన్నికల్లో మటన్ పంచినప్పటికీ ఓడిపోయానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగపూర్ లో మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్ (ఎంఎస్‌టీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓటర్లు చాలా తెలివైనవారని, ఎవరికి ఓటు వేయాలో వారికి కచ్చితంగా తెలుసునని అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని, ప్రేమను సంపాదిస్తే చాలన్నారు. అప్పుడు డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం, బ్యానర్లు, పోస్టర్లు వేయడం కోసం ఖర్చు చేసే అవసరం ఉండదన్నారు.
ఇదే సందర్భంలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. గతంలో తాను ఒక్కో ఓటరుకు ఒక కిలో మటన్ పంపిణీ చేసిన తర్వాత కూడా ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఓటర్లు చాలా తెలివైనవారని, ప్రతి అభ్యర్థి నుండి వారు ఎన్నికల సమయంలో వచ్చే డబ్బులు, ఇతరాలను స్వీకరిస్తారని, కానీ చివరకు తమకు సరైన లేదా నచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తారని అన్నారు.