Ionosphere: అయనోస్పియర్‌కు ఎలాన్‌మస్క్ స్పేస్‌ఎక్స్ రాకెట్ రంధ్రం.. భూమికి ముప్పు తప్పదని హెచ్చరికలు!

Space X rocket punctures Ionosphere

  • ఈ నెల 23న 22 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఫాల్కన్ 9 రాకెట్
  • ఈ క్రమంలో అయనోస్పియర్‌కు రంధ్రం
  • రేడియో తరంగాలపై ప్రభావం చూపించే అవకాశం
  • రంధ్రం కారణంగా అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరుతాయంటున్న శాస్త్రవేత్తలు

ఎలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ రాకెట్ అయనోస్పియర్‌ (అయానావరణం)కు భారీ రంధ్రం చేసిందని, దీని వల్ల భూమికి ముప్పు తప్పదని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఆదివారం 22 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. తిరిగి వస్తూ సముద్రంలోని ఓడపై రాకెట్ ల్యాండైంది. ఫాల్కన్9 రాకెట్ నమ్మకమైన, సురక్షిత రవాణాకు అనుకూలమైన రెండు దశల పునర్వినియోగ రాకెట్. ఇది 240 ప్రయోగాలు నిర్వహించింది. 198 సార్లు ల్యాండ్ అయింది.

ఈ నెల 19న కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ నుంచి దీనిని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్ అని స్పేస్ఎక్స్ పేర్కొంది. కాగా, 19న ప్రయోగం తర్వాత ఆకాశంలో మసగ్గా ఎరుపు రంగు కాంతి బోస్టన్ యూనివర్సిటీకి చెందిన అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బాంగార్డెనర్‌ దృష్టిని ఆకర్షించింది. అకస్మాత్తుగా కనిపించిన ఆ ఎరుపు రంగంపై అధ్యయనం చేసిన ఆయన అయనోస్పియర్‌కు రంధ్రం పడడం ద్వారా ఏర్పడిందని గుర్తించారు. భూమికి 200 నుంచి 300 కిలోమీటర్ల పైన రాకెట్ తమ ఇంజిన్లను మండించుకుంటుందని, ఆ సమయంలో ఈ రంధ్రం ఏర్పడి ఉంటుందని ఆయన వివరించారు. 

ఎఫ్-రిజియన్ పీక్ వద్ద 286 కిలోమీటర్ల సమీపంలో రాకెట్ రెండో దశలో ఇంజిన్లు మండించినప్పుడు ఈ రంధ్రం ఏర్పడి ఉంటుందని తన అధ్యయనంలో వెల్లడైందన్నారు. కాగా, ఫాల్కన్ 9 రాకెట్ పర్యావరణాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. ‘సైన్స్ టైమ్స్’ ప్రకారం 24 ఆగస్టు 2017లో ‘ఫార్మోశాట్-5’ పేలోడ్‌ను మోసుకెళ్లినప్పుడు కూడా రాకెట్ ఇలాంటి నష్టమే చేసింది. తక్కువ బరువు కారణంగా రాకెట్ భూమి ఉపరితలంతో సమాంతరంగా కాకుండా నిలువుగా ప్రయోగించడంతో వచ్చిన షాక్‌ వేవ్‌ల కారణంగా అయనోస్పియర్ ప్లాస్మాలో రంధ్రం ఏర్పడింది.  

అయనోస్పియర్ అనేది సోలార్ రేడియేషన్‌ ద్వారా సౌరవికరణం చెందుతుంది. వాతావరణంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయస్కాంత గోళం ఇన్నర్ ఎడ్జ్‌ను ఏర్పరుస్తుంది. అయనోస్పియర్ కమ్యూనికేషన్, నావిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ఇది ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు దీనికి రంధ్రం పడడం వల్ల వాటిపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ఇది గ్రహించడం ద్వారా అవి భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. రంధ్రం కారణంగా అవి నేరుగా భూమిని చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.

More Telugu News