Onion Irradiation: టమాటా ధరల పెరుగుదలతో కేంద్రం అప్రమత్తం..ఉల్లిపాయలకు ఇరేడియేషన్ ప్రక్రియ
- ఉల్లిధరల నియంత్రణకు ఇరేడియేషన్ సాంకేతికత సాయం తీసుకుంటున్న కేంద్రం
- ఉల్లిపాయలపై గామా కిరణాల ప్రసరణతో సూక్ష్మక్రిముల అంతం
- త్వరగా మొలకెత్తడాన్ని అడ్డుకోవడంతో అధికకాలం పాటు నిల్వ చేసుకునే అవకాశం
టమాటా ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఉల్లిపాయల విషయంలో ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. తొలిసారిగా ఇరేడియేషన్ టెక్నాలజీతో ఉల్లిపాయల ధరల కట్టడికి సిద్ధమైంది. ఇరేడియేషన్ ప్రక్రియలో ఎక్స్‌రే, గామా, ఎలక్ట్రాన్ కిరణాలను ఆహారంపై ప్రసరిస్తారు. ప్రస్తుతం ఉల్లిపాయలపై గామా కిరణాలు ప్రసరిస్తున్నారు. దీంతో, అందులో సూక్ష్మజీవులు, కీటకాలు సమూలంగా నశించి ఉల్లిపాయలు అధికకాలంపాటు నిల్వఉంటాయి. నాణ్యత, రుచి యథాతధంగా ఉంటాయి.
ఈ సాంకేతికతతో ఉల్లిపాయలు, బంగాళదుంపలు త్వరగా మొలకెత్తకుండా నిరోధించవచ్చు. దీంతో, దేశ అవసరాలకు సరిపడా ఉల్లిపాయల నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ధరలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణకు 3 లక్షల టన్నుల అదనపు బఫర్ స్టాక్ సేకరించనుంది. శీతల గిడ్డంగికి తరలించే ముందే వాటిని ప్రయోగాత్మకంగా ఇరేడియేషన్‌కు గురి చేస్తుంది. ఇందుకు బాబా అణు పరిశోధన కేంద్రం సాయాన్ని తీసుకోనుంది.