Virat Kohli: విండీస్ తో రెండో టెస్టులో కోహ్లీ శతకానందం

Kohli registers century against West Indies in 2nd Test

  • కెరీర్ లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ
  • సెంచరీతో చిరస్మరణీయం
  • 206 బంతుల్లో 121 పరుగులు చేసి రనౌట్ అయిన కోహ్లీ
  • టెస్టుల్లో 29వ సెంచరీ సాధించిన వైనం

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో రెండో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. 206 బంతులాడి 121 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కోహ్లీ స్కోరులో 11 బౌండరీలున్నాయి. 100 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 180 బంతులు అవసరం అయ్యాయి. 

కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ కాగా, అన్ని ఫార్మాట్లలో కలిపి వెస్టిండీస్ పై 12వ సెంచరీ కావడం విశేషం. కాగా, విండీస్ తో రెండో టెస్టు కోహ్లీ కెరీర్ లో 500వ అంతర్జాతీయ మ్యాచ్. సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ఈ మ్యాచ్ ను చిరస్మరణీయం చేసుకున్నాడు. 

ఇవాళ ఆటకు రెండో రోజు కాగా, టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 387 పరుగులతో ఆడుతోంది. ఇషాన్ కిషన్ 20, రవిచంద్రన్ అశ్విన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు, రవీంద్ర జడేజా (61) అర్ధసెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ, జడేజా జోడీ ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించి భారత్ భారీ స్కోరుకు బాటలు పరిచింది. విండీస్ బౌలర్లలో కీమార్ రోచ్ 2, షానన్ గాబ్రియెల్ 1, జోమెల్ వారికన్ 1, జాసన్ హోల్డర్ 1 వికెట్ తీశారు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 57, కెప్టెన్ రోహిత్ శర్మ 80, శుభ్ మాన్ గిల్ 10, అజింక్యా రహానే 8 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News