Himayat Sagar: నిండు కుండల్లా జలాశయాలు.. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
- హిమాయత్ సాగర్ నుంచి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు
- మూసీ నదికి పెరుగుతున్న వరద
- లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద పోటెత్తుతోంది. రెండు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 1,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,761.20 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1,784.70 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పెరిగింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.