Parliament Sessions: మరి కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. తొలి రోజే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా విపక్షాల వ్యూహం!

Parliament Monsoon session begins today

  • ఆగస్ట్ 11 వరకు మొత్తం 17 పని దినాల పాటు కొనసాగనున్న సమావేశాలు
  • మణిపూర్ హింసపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్న విపక్షాలు
  • నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన 34 పార్టీలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభంకాబోతున్నాయి. ఆగస్ట్ 11 వరకు మొత్తం 17 పని దినాల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 31 బిల్లులను ప్రవేశపెడుతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

మరోవైపు ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగబోతున్నాయి. మణిపూర్ లో చెలరేగిన హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయబోతున్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికారపక్షం కూడా సర్వసన్నద్ధంగా ఉంది.

మరోవైపు నిన్న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 34 పార్టీలు హాజరయ్యాయని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని ఈ సమావేశంలో కోరినట్టు ఆయన చెప్పారు. అన్ని అంశాల గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 

ఇంకోవైపు మణిపూర్ అల్లర్లపై సమావేశాల తొలిరోజే వాయిదా తీర్మానాన్ని ఇవ్వాలని కొన్ని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ సమక్షంలో ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ అల్లర్ల అంశాన్ని లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ నిన్ననే ప్రకటించింది. కులగణన, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్లు తదితర అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. పార్టమెంట్ సెషన్స్ కు ముందు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది.

Parliament Sessions
India

More Telugu News