YS Jagan: యూసీసీపై ఏపీ సీఎం జగన్ ను కలిసిన ముస్లిం ప్రతినిధులు
- కేంద్రం తెచ్చే యూసీసీని వ్యతిరేకించాలని సీఎంను కోరిన ప్రతినిధులు
- యూసీసీ డ్రాఫ్ట్ రాలేదని వ్యాఖ్యానించిన సీఎం జగన్
- యూసీసీపై దుష్ప్రచారం జరుగుతోందన్న ఉపముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం ముస్లిం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తోన్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా వారు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన జగన్... ఇప్పటి వరకు యీసీసీ డ్రాఫ్ట్ కూడా రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా తెలియదన్నారు. యూసీసీ బిల్లులో మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకిస్తామని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది.
యూసీసీపై దుష్ప్రచారం
కనీసం డ్రాఫ్ట్ కూడా జరగని యూసీసీపై దుష్ప్రచారం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ పాషా అన్నారు. ఈ బిల్లులో మైనార్టీ హక్కులకు భంగం వాటిల్లితే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. యూసీసీ వల్ల ప్రయోజనం ఎంత? నష్టం ఎంత? అనే అంశాలపై ఆలోచించాలని, ఇవన్నీ డ్రాఫ్ట్ వచ్చాక తెలుస్తాయన్నారు. యూసీసీలో ఏ అంశాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. మైనార్టీలకు విఘాతం కలిగించే బిల్లులను వ్యతిరేకిస్తామని జగన్ స్పష్టం చేశారన్నారు.