H-1B visas: భారతీయులకు శుభవార్త.. హెచ్-1బీ వీసాలను రెండింతలు చేసే బిల్లును యూఎస్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజా కృష్ణమూర్తి
- ప్రస్తుతం ఏడాదికి 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తున్న అమెరికా
- దీనిని ‘హైర్ యాక్ట్’గా అభివర్ణించిన రాజా కృష్ణమూర్తి
- అమెరికా కంపెనీలకు నేరుగా ప్రయోజనం
భారతీయలకు ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రస్తుతం జారీ చేస్తున్న హెచ్-1బీ వీసాలను రెండింతలు చేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి గత శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా ప్రస్తుతం ఏడాదికి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుండగా వాటిని 1.30 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే భారతీయులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
ఈ సందర్భంగా వీసాల పెంపు వల్ల అమెరికా కంపెనీలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ బిల్లును ఆయన ‘హైర్ యాక్ట్’గా అభివర్ణించారు. దీనివల్ల అమెరికా కంపెనీలు తమకు అవసరమైన కార్మికులను పొందడం మరింత సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను పొందడం ద్వారా సాంకేతికతలో మనం ముందుండాలని ఆయన పేర్కొన్నారు.
హైర్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టడం తనకు గర్వకారణమని అన్నారు. కాగా, పాఠశాలల్లో ‘స్టెమ్’ (సైన్స్, టెక్, ఇంజినీరింగ్, మ్యాథ్స్) స్ట్రీమ్‌కు నిధులు సమకూర్చడం ద్వారా అమెరికాలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను అధిగమించేందుకు ఇది ప్రయత్నిస్తుందని వివరించారు.