Nara Lokesh: చంద్రయాన్-3 సక్సెస్ తో జగన్ రగిలిపోయాడు.... ఎందుకంటే: నారా లోకేశ్
- కొండపి నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర
- కె.అగ్రహారంలో భారీ బహిరంగ సభ
- చంద్రయాన్-3 పేరు నేపథ్యంలో సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
- జగన్ పాలనలో బడిలో మాస్టారుకు, స్టేషన్ లో ఎస్సైకి కూడా భద్రతలేదని వెల్లడి
టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు కొండపి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. కొండపి ప్రాంతం ప్రాశస్త్యం, దివంగత సీనియర్ నేత దామచర్ల ఆంజనేయులు గురించి, పొగాకు రైతుల గురించి ప్రస్తావించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడమే కాదు, కొంచెం హాస్యం కూడా ప్రదర్శించారు.
"వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వల్లూరమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కొండపి. కొండపి రూపురేఖలు మార్చిన గొప్ప నేత దామచర్ల ఆంజనేయులు గారు. పొగాకు రైతుల కష్టాలు చూసి కొండపిలో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు. పవిత్రమైన కొండపి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని వివరించారు.
చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది. జగన్ కి కోపం వచ్చింది. మొన్న జగన్ టీవీ చూస్తుంటే ఇస్రో చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది అనే వార్త వచ్చింది. ఆ వార్త చూసి జగన్ కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో టీవీ పగలగొట్టేశాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలని పిలిచి చితకబాదాడు.
పాపం, సజ్జలకి అర్ధం కాలేదు. అసలు నన్ను ఎందుకు తిడుతున్నాడు అనుకున్నాడు. భయపడుతూనే ఏం జరిగింది సార్ అన్నాడు సజ్జల. చంద్రయాన్ అని పేరు పెడితే ఏం పీకావ్? అధికారంలో ఉన్నది మనమా? చంద్రబాబా? అని అడిగాడు. జగన్యాన్ అని పేరు పెట్టకపోతే ఇస్రో దగ్గరకి జేసీబీ పంపుతాం అని వార్నింగ్ ఇవ్వాలి కదా అన్నాడు. అక్కడికి జేసీబీ పంపితే మనం జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే సార్ అన్నాడట సజ్జల.
ఇంకో పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ పై దాడి చేశాడు. సూళ్లూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు అతని డ్యూటీ చేశారు. రౌడీషీట్ లో ఉన్న వైసీపీ నేత సునీల్ రెడ్డిని కౌన్సిలింగ్ కి పిలిచారు. కానీ, ఆ సునీల్ రెడ్డి ఏకంగా దళిత ఎస్ఐ రవిబాబుపై దాడి చేశాడు. పైగా ఎస్ఐ పై రివర్స్ కేసు పెట్టాడు. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
కొండపిని అభివృద్ధి చేసింది టీడీపీ
2024లో స్వామి గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి, కొండపిని అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తాం. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా. కొండపిలో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.