Sunil Gavaskar: డబ్ల్యూటీసీ ఫైనల్లో తీసుకున్న నిర్ణయాలపై వాళ్లిద్దరినీ నిలదీయండి: బోర్డుకు గవాస్కర్ సూచన

Gavaskar says board and selectors should ask questions captain and coach for Team India lose in WTC Final

  • ఇటీవల టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
  • 209 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన భారత్
  • విమర్శలపాలైన టీమిండియా టాస్ నిర్ణయం
  • కెప్టెన్, కోచ్ లే బాధ్యులన్న గవాస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఘోర పరాజయం చవిచూడడం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీల మోత మోగించగా, భారత్ పరుగుల వేటలో చేతులెత్తేసింది. 

ఓవల్ మైదానంలో జరిగిన ఈ టెస్టు సమరంలో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమిపాలవడం విమర్శకులకు పని కల్పించింది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇప్పటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తీసుకున్న నిర్ణయాలపై టీమిండియా కెప్టెన్, కోచ్ లను నిలదీయాలని బీసీసీఐకి, సెలెక్టర్లకు సూచించారు. 

"డబ్ల్యూటీసీ ఫైనల్లో టాస్ గెలిచి ఎందుకు ఫీల్డింగ్ ఎంచుకున్నారు? అని వారిని ప్రశ్నించాలి. అయితే టాస్ సమయంలోనే దీనిపై వివరణ ఇచ్చారు, ఆ వివరణను అందరూ చూశారు. ఆ తర్వాత అడగాల్సిన ప్రశ్న... ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ బౌన్సర్లను ఆడలేడని తెలిసినప్పుడు అతడికి ఎందుకు బౌన్సర్లు వేయలేదని అడగాలి. ట్రావిస్ హెడ్ షార్ట్ బాల్స్ బలహీనత మీకు తెలియదా? 

కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్, అతడికి బౌన్సర్లు వేయండి, అతడికి బౌన్సర్లు వేయండి అని చెబుతూనే ఉన్నాడు. హెడ్ బౌన్సర్లు ఆడలేడని అందరికీ తెలుసు... మీకు ఎందుకు తెలియలేదు? ట్రావిస్ హెడ్ 80 పరుగులు చేశాక అప్పుడు అతడికి బౌన్సర్లు వేయడం ప్రారంభించారు. ఇలా ఎందుకు జరిగింది? అని సెలెక్టర్లు, బీసీసీఐ భారత జట్టు కెప్టెన్, కోచ్ లను పిలిపించి ప్రశ్నించాలి" అని గవాస్కర్ పేర్కొన్నారు.

More Telugu News