IPL: 8 ఏళ్లు ఆడిన ఆర్సీబీ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోతున్న స్టార్ స్పిన్నర్ చాహల్
- ఆర్సీబీ తరఫున దాదాపు 140 మ్యాచ్‌లు ఆడిన చాహల్
- 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లిన ఆటగాడు
- తనను వదులుకునేప్పుడు ఆర్సీబీ సరైన
సమాచారం ఇవ్వలేదన్న చాహల్
టీమిండియా నాణ్యమైన స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. తన లెగ్ స్పిన్ బౌలింగ్ తో భారత జట్టును ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడు. ఐపీఎల్‌లోనూ తన బౌలింగ్ మ్యాజిక్ తో సత్తా చాటాడు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో అతను చాన్నాళ్లు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లిన చాహల్ అక్కడా చెలరేగిపోతున్నాడు. అయితే, ఎంతో నమ్ముకున్న ఆర్సీబీ జట్టు తనకు నమ్మకద్రోహం చేసిందని చాహల్ మరోసారి విమర్శించాడు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న చాహల్ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఆ జట్టుపై తాను చాలా కోపంగా ఉన్నానని తెలిపాడు.
తన కోపానికి కారణం ఏంటో అతను వెల్లడించాడు. ‘నేను ఆర్సీబీ తరఫున దాదాపు 140 మ్యాచ్‌లు ఆడాను. కానీ, ఆ జట్టు నన్ను వదిలేసింది. నన్ను వదులుకునే క్రమంలో ఆ జట్టు నుంచి తనకు సరైన సమాచారం రాలేదు. 2022 ఐపీఎల్ వేలంలో నన్ను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఎందాకైనా వెళ్తామని ముందుగా నాకు హామీ ఇచ్చారు. కానీ, వేలంలోకి వచ్చాక పట్టించుకోలేదు. దాంతో, నాకు చాలా కోపం వచ్చింది. ఆ జట్టు కోసం 8 సంవత్సరాలు ఆడాను. చిన్నస్వామి స్టేడియం నాకు చాలా ఇష్టమైనది. ఇంత సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకునే ముందు నాకు సమాచారం ఇవ్వకపోవడం బాధ, కోపాన్ని కలిగించింది’ అని చాహల్ చెప్పుకొచ్చాడు.