BRO: "జాణవులే నెరజాణవులే"... 'బ్రో' నుంచి రెండో పాట వదిలారు!

Second single from BRO out now

  • పవన్ కల్యాణ్, సాయితేజ్ ముఖ్య పాత్రల్లో బ్రో
  • సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం
  • జులై 28న విడుదల
  • ఇటీవలే మైడియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్
  • నేడు రెండో పాటను తీసుకువచ్చిన చిత్రబృందం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. కాగా, ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ నేడు విడుదల చేశారు. 

తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని పాటను లాంచ్ చేశారు. థియేటర్లలో జాణవులే పాటను లాంచ్ చేసి, అభిమానులతో కలిసి వీక్షించారు.

'జాణవులే నెరజాణవులే' అంటే సాగే ఈ రొమాంటిక్ గీతాన్ని సాయిధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించారు. తమన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను తమన్, ప్రణతి ఆలపించారు. 

ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న 'బ్రో' చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

'బ్రో' నుంచి ఇటీవల విడుదలైన మైడియర్ మార్కండేయ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్, సాయిధరమ్ తేజ్ లపై చిత్రీకరించిన ఆ పాట లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో వ్యూస్ వెల్లువెత్తాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు.

BRO
Jaanavule
Second Single
Pawan Kalyan
Sai Dharam Tej
Thaman
Kasarla Shyam
Samuthirakani

More Telugu News