Chandrababu: కేంద్ర అటవీ మంత్రి భూపేందర్ యాదవ్ కు చంద్రబాబు లేఖ
- పశ్చిమ గోదావరి జిల్లాలో అటవీభూములు ఆక్రమిస్తున్నారన్న చంద్రబాబు
- విలువైన అటవీభూమి అన్యాక్రాంతమవుతోందని వెల్లడి
- కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూముల్లో పనులు చేస్తున్నారని ఆరోపణ
- కేంద్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లంచెర్ల రాజుపాలెంలో అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ చంద్రబాబు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని వెల్లడించారు.
3,255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీశాఖ అధీనంలో ఉందని తెలిపారు. అయితే అటవీశాఖకు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు వివరించారు. నాడు రెవెన్యూ అధికారులు తీసుకున్న ఆ నిర్ణయంపై న్యాయస్థానాల్లో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు.
ఆ భూమి తమకు చెందినదేనని ఎవరికి వారుగా ఆక్రమణదారులు, వారసులు కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. దీనిపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ పనులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆయా భూముల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, బోరు బావులు తవ్వుతున్నారని వివరించారు. అక్రమ రెవెన్యూ రికార్డులతో అటవీభూముల్లో పనులు చేపడుతున్న వారికి వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సంబంధిత భూములను తక్షణమే సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో, వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కబ్జాదారులతో కుమ్మక్కైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.