Team India: మూడ్రోజుల్లోనే ముగించిన భారత్.. చిత్తుగా ఓడిన వెస్టిండీస్

 India innings win over west indies in 1st innings

  • తొలి టెస్టులో భారత్ ఘన విజయం
  • ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపు
  • యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

వెస్టిండీస్ పర్యటనను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ లో భాగంగా ఆ జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ విజయం సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 150 పరుగులకే ఆలౌటవగా.. భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను 421/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీలతో సత్తా చాటగా, విరాట్ కోహ్లీ (76) రాణించాడు. 

దాంతో, భారత్ కు 271 పరుగుల ఆధిక్యం సాధించింది. భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీబియన్‌ జట్టు 130 పరుగులకే ఆలౌటైంది. అలిక్ అతాజనే (28) టాప్‌ స్కోరర్. రవిచంద్రన్‌ అశ్విన్ ఏడు వికెట్లతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. జడేజా రెండు వికెట్లు, సిరాజ్‌ ఒక వికెట్ తీశాడు. అరంగేట్రం టెస్టులోనే భారీ సెంచరీ చేసిన యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ లో భారత్ 1–0తో ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు ఈ నెల 20న ప్రారంభం అవుతుంది.

More Telugu News