Chandrayaan-3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
- భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు... చంద్రయాన్-3
- ఈ మధ్యాహ్నం 2.35.13 గంటలకు ప్రయోగం
- నిర్దేశిత సమయానికే లాంచింగ్
- 16 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోనున్న ప్రొపల్షన్ మాడ్యూల్
- ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనున్న మాడ్యూల్
భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.
ఈ మధ్యాహ్నం 2.35.13 గంటలకు రాకెట్ ప్రయోగం ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత సమయానికే జరిగింది. ఈ ప్రయోగానికి శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదికను ఉపయోగించుకున్నారు.
కాగా, 16 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి కీలకమైన ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోనుంది. చందమామ దక్షిణ ధ్రువంలో ప్రొపల్షన్ మాడ్యూల్ కిందికి దిగనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి ఇంతవరకు ఎవరూ చేరుకోకపోగా, చరిత్ర సృష్టించేందుకు చంద్రయాన్-3 సిద్ధమైంది.
ప్రొపల్షన్ మాడ్యూల్ ఆగస్టు 23 లేదా 24వ తేదీ నాటికి చందమామ ఉపరితలంపై ల్యాండవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.