Hollywood: సినీ కళాకారుల స్ట్రయిక్.. స్తంభించిపోయిన హాలీవుడ్
- హాలీవుడ్‌లోనూ ఏఐ కలకలం
- పారితోషికాల పెంపు, కృత్రిమ మేధ నుంచి భద్రత కోరుతూ స్క్రీన్ యాక్టర్ గిల్డ్ స్ట్రయిక్
- ఏఐ వినియోగాన్ని తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేయని బడా స్టూడియోలు
- స్టూడియోలు, ఓటీటీ వెబ్ సైట్లతో చర్చలు విఫలమవడంతో సమ్మెకు పిలుపు
- భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ప్రారంభమైన సమ్మె
హాలీవుడ్‌లోనూ ఏఐ కలకలం రేగింది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలంటూ హాలీవుడ్ సినీ కళాకారులు, ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి సమ్మె ప్రారంభమైంది. 1960 తరువాత హాలీవుడ్‌లో ఈ స్థాయి సమ్మె జరగడం ఇదే తొలిసారి.
ఓటీటీ రాకతో నానాటికీ తగ్గిపోతున్న పారితోషికాలు, ముంచుకొస్తున్న కృత్రిమ మేధ ఉపద్రవం నుంచి తమని తాము రక్షించుకునేందుకు సమ్మె బాట పట్టినట్టు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పేర్కొంది. స్టూడియోలు, ఓటీటీ వేదికలతో తాము జరిపిన చర్చలు విఫలమయ్యాయని యూనియన్ తరపున చర్చల్లో పాల్గొన్న డంకన్ క్యాబ్రీ ఐర్లాండ్ మీడియాకు తెలిపారు.
గత పన్నెండు వారాలుగా అక్కడి సినీ రచయితలు పిక్కెట్ లైన్స్‌లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి తోడుగా నటీనటులు కూడా తాజాగా రంగంలోకి దిగారు. హలీవుడ్ ప్రముఖులు మెరిల్ స్ట్రీప్, జెన్నిఫర్ లారెన్స్ వంటి వారందరూ సమ్మె బాట పట్టిన కళాకారులకు మద్దతుగా నిలిచారు. తన ఒపెన్‌హైమర్ సినిమా ప్రీమియర్ షో ఈవెంట్ నుంచి నటీనటులు వైదొలగారని ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తాజాగా పేర్కొన్నారు.
‘‘ఓటీటీలు వచ్చాక మా పారితోషికాల్లో బాగా కోతపడింది. ఇప్పుడు కృత్రిమ మేధ రాకతో సృజనాత్మకతపై ఆధారపడ్డ రంగాల అస్థిత్వానికే ముప్పు వచ్చి పడింది’’ అని స్క్రీన్ యాక్టర్ గిల్డ్ తన ప్రకటనలో పేర్కొంది. తమ వేదికల్లోని కంటెంట్‌కు ప్రేక్షకాదరణతో సంబంధం లేకుండా ఓటీటీ వేదికలు.. తారలు, ఇతర కళాకారుల పారితోషికాలు నిర్ణయిస్తున్నాయి. మరోవైపు, సినీరంగంలో కృత్రిమ మేధ నియంత్రణకు బడా స్టూడియోలు ససేమిరా అంటున్నాయి. దీంతో, మెజారిటీ కళాకారులు సమ్మెబాట పట్టారు. ఫలితంగా హాలీవుడ్ స్తంభించి పోయింది. విడుదలకు సిద్ధంగా అనేక బడా సినిమాలు వాయిదా పడక తప్పదని అక్కడి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.