Baby: ‘బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కన్నీరుపెట్టుకున్న హీరోయిన్

Vaishnavi chaitanya gets emotional in baby pre release event

  • ఈ నెల14న విడుదల కానున్న ‘బేబీ’
  • హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్
  • దర్శకుడు సాయి రాజేశ్ తనకు నటిగా పునర్జన్మనిచ్చారంటూ హీరోయిన్ వైష్ణవి భావోద్వేగం

‘బేబీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ వైష్ణవి చైతన్య వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, దర్శకుడు సాయి రాజేశ్ నటిగా పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 

ఈవెంట్‌లో పాల్గొన్న నటి వైష్ణవి చైతన్య సినిమా గురించి మాట్లాడుతూ తానో కొత్త ప్రపంచాన్ని చూశానని చెప్పుకొచ్చారు. ‘‘సమాజంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. కథలో ప్రతిఒక్కరూ లీనమవుతారు. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండే నా దగ్గరకు ఈ ‘బేబీ’ కథ వచ్చింది. దర్శకుడు రాజేశ్ నన్ను నాకన్నా ఎక్కువ నమ్మి ముందుకు నడిపించారు. ‘ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సినిమాలో లీడ్‌గా చేయలేదు’ అని చాలా మంది అన్నారు. దీంతో, నాకూ భయం ఉండేది. సినిమా గురించి అన్ని విషయాలు వివరించి, రాజేశ్ ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వల్లే నేనో కొత్త ప్రపంచాన్ని చూశా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘బేబీ’ ఓ మాస్ సినిమా అని చెప్పుకొచ్చారు. ‘‘ ‘మీ అన్నయ్య విజయ్‌కి మాస్ ఇమేజ్ వచ్చిందిగా, నువ్వెందుకు అలాంటి కథలు ఎంపిక చేసుకోవట్లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నావా?’ అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అసలు మాస్ అంటే ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ప్రేమలో నిజాయతీగా ఉండటమే నా ఉద్దేశంలో మాస్. ఆ కోణంలో చూస్తే ‘బేబీ’ మాస్ సినిమా. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు.

More Telugu News