Jagan: ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు: జగన్
- చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాలన్న సీఎం
- సమీక్ష జరిపి నివేదిక పంపాలంటూ కలెక్టర్లకు ఆదేశాల జారీ
- పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో సీఎం జగన్ సూచన
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న, ఇప్పటికే చేసిన పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. ఈ విషయంలో చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ సూచనలు చేశారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ప్రతీ ఆరు నెలలకు సీఎంవోకు నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. స్థానికులకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే పరిశ్రమల స్థాపనలో ప్రైవేటు యాజమాన్యాలకు అండగా ఉంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఒక పరిశ్రమ సమర్థవంతంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని స్థానికుల మద్దతు చాలా అవసరం అని చెప్పారు.
ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలతో పాటు నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు, కొత్తగా రాష్ట్రానికి రాబోతున్న కంపెనీలలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరులకు కొరత లేదని జగన్ తెలిపారు.