women: ఆన్ లైన్ లో ప్రేమ వల.. ఎనిమిది మందిని పెళ్లాడిన యువతి

women marries 8 men in three states

  • పెళ్లి తర్వాత డబ్బు, నగలతో జంప్
  • ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బాధితులు
  • కిలేడీ కోసం గాలిస్తున్న చెన్నై పోలీసులు

సోషల్ మీడియాలో డబ్బున్న వారితో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో వల విసురుతుంది.. పెళ్లి చేసుకుని కాపురానికి వస్తుంది. ఆపై ఓ మంచి రోజు చూసుకుని ఇంట్లో దాచిన డబ్బూ, నగలతో ఉడాయిస్తుంది. చెన్నైకి చెందిన ఓ యువతి చేస్తున్న ఘరనా మోసమిది. ఇలా పలు రాష్ట్రాలలో ఏకంగా ఎనిమిది మందిని మోసం చేసింది. తాజాగా ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కిలేడీ కోసం చెన్నై పోలీసులు వెతుకుతున్నారు.

తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాలో రషీద అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే గడిచినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో రషీద అదృశ్యమైంది. మూర్తి ఫిర్యాదుతో దర్యాఫ్తు మొదలు పెట్టిన పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు.

నీలగిరి జిల్లా గూడలూర్ కు చెందిన రషీద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డబ్బున్న మగవారిని పరిచయం చేసుకుంటుందని, వారితో నిత్యం ఛాట్ చేస్తూ ప్రేమ పేరుతో దగ్గరవుతుందని పోలీసులు తేల్చారు. ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోతుందని తెలిపారు. ఇలా ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని వెల్లడించారు.

women
Cheating
Social Media
love
marriage
Tamilnadu
ap
  • Loading...

More Telugu News