Sharad Pawar: ప్రధానితో ఒకే వేదికను పంచుకోబోతున్న శరద్ పవార్, అజిత్ పవార్
- ప్రధాని మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు
- పూణెలో ఆగస్టు 1న ప్రదానం
- ముఖ్య అతిథిగా శరద్ పవార్
- అదే కార్యక్రమానికి అజిత్ పవార్
ఎన్సీపీకి చేయిచ్చి మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) ప్రభుత్వంలో చేరిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ‘మహా’ రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు. త్వరలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వేదిక పంచుకోబోతున్నారు. ఆగస్టు 1న పూణెలో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును మోదీ అందుకోబోతున్నారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అందిస్తున్న ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు అజిత్ పవార్ కూడా హాజరుకాబోతున్నారు. ఎన్సీపీకి అజిత్ గుడ్‌బై చెప్పిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది.
ప్రధానమంత్రి మోదీ ప్రజల్లో దేశభక్తి భావనను మేల్కొల్పారని, దేశాన్ని ప్రపంచం పటంలో నిలిపారని ట్రస్ట్ పేర్కొంది. ఆయన పట్టుదల, కృషికి ప్రతీకగానే ఈ అవార్డు కోసం ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ట్రస్ట్ పేర్కొంది. లోకమాన్య తిలక్ 103వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించున్న కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొంది. కాగా, ఇదే కార్యక్రమానికి శరద్ పవార్‌తోపాటు అజిత్ కూడా హాజరు కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.