Shekar Kapur: ఆయనకు నిజాయతీ లేదు, నన్ను మోసగించారు.. మాజీ భర్తపై గాయని సుచిత్ర కృష్ణమూర్తి ఆరోపణ

suchitra krishnamoorthi says shekar kapur cheated on her

  • మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌పై గాయని సుచిత్ర కృష్ణమూర్తి ఆరోపణ
  • తల్లి వద్దంటున్నా వినకుండా ఆయనను పెళ్లి చేసుకున్నానని వెల్లడి
  • వ్యక్తిగత జీవితంలో శేఖర్‌కు నిజాయతీ లేదని ఆరోపణ
  • ఇద్దరికీ పొసగక విడాకులు తీసుకున్నామన్న సుచిత్ర

ప్రముఖ దర్శకుడు, తన మాజీ భర్త శేఖర్ కపూర్‌ గురించి నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను మోసగించడంతోనే తమ వైవాహిక బంధం ముగిసిందని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఆయనకు నిజాయతీ లేదని అన్నారు. శేఖర్ కపూర్ ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ‘మిస్టర్ ఇండియా’, 'బాండిట్ క్వీన్', ‘ఎలిజబెత్’, ‘వాట్స్ లవ్ గాట్ టు డు విత్ ఇట్’ వంటి జనాదరణ పొందిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

ఇక ఆయనతో ప్రేమ, పెళ్లి గురించి సుచిత్ర చెబుతూ, ‘‘ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి నేను వచ్చా. స్కూల్‌లో చదువుతుండగానే నాకు అవకాశాలు వచ్చాయి. కళాశాలలో చదువుతున్నప్పుడు నాకు ‘కభీ హా కభీ’లో తొలి అవకాశం వచ్చింది. అదే సమయంలో మలయాళంలో కూడా నటించా. పరిశ్రమపై నా తల్లిదండ్రులకు సదభిప్రాయం లేకపోవడంతో వాళ్లకు అబద్ధం చెప్పి సినిమాల్లో పని చేశా. శేఖర్‌తో పరిచయం అయ్యాక ఆయన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆయనకు నేను సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. అదేమీ నాకు పెద్ద విషయం కాకపోవడంతో నేను మరో ఆలోచన లేకుండా ఆయన మాటకు అంగీకరించా’’ 

‘‘శేఖర్ కపూర్‌తో వివాహం నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. శేఖర్ నా కంటే వయసులో పెద్దవాడు కావడం, అప్పటికే విడాకులు తీసుకోవడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని పెళ్లి చేసుకోవద్దని మా అమ్మ పలుమార్లు చెప్పింది. శేఖర్‌ను మర్చిపోవాలని సూచించింది. కానీ, నాకు ఆయనను వదులుకోవడం అప్పట్లో ఇష్టం లేకపోయింది. ఆ తరువాత మా పెళ్లి జరిగింది. ఇద్దరి మధ్య పొసగక పోవడంతో మేం విడిపోవాల్సి వచ్చింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

More Telugu News