India: మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా కీలక ఆయుధ కొనుగోళ్లు
- జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
- ప్రత్యేక అతిథిగా ప్యారిస్ వెళుతున్న మోదీ
- ఫ్రాన్స్ తో ఆయుధ ఒప్పందం కుదిరే అవకాశం
- 26 రాఫెల్ విమానాలు, 4 స్కార్పియన్ జలాంతర్గాముల కొనుగోలుపై భారత్ ఆసక్తి
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (జులై 14) సందర్భంగా ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ వెళుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో, భారత్-ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించనుంది.
ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను అందుకున్న భారత్... మోదీ పర్యటనను మరిన్ని ఆయుధ కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోనుంది. మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా 26 రాఫెల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలుకు మేక్రాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ముందు భారత నేవీ పలు ప్రతిపాదనలు ఉంచింది.
ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరితే, 22 సింగిల్ సీటర్ రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలతో పాటు 4 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్టులు కూడా భారత్ కు అందజేస్తారు. హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో భద్రతా సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో, భారత నేవీ ఆయుధాల కొరతను ఎదుర్కొంటోంది. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కార్పియన్ సబ్ మెరైన్లు అత్యవసరంగా కావాలని నేవీ కోరుకుంటోంది.
ఒకవేళ ఫ్రాన్స్ గనుక రాఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ లను అందిస్తే, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకల నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి.