Ujjaini Mahakali Bonalu: ప్రారంభమైన మహంకాళి బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
- ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని
- భక్తులతో కోలాహలంగా ఆలయం
- ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
- అమ్మవారికి బోనం సమర్పించనున్న ఎమ్మెల్సీ కవిత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. దీంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆరు క్యూలు ఏర్పాటు చేశారు. బోనాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రత్యేకంగా 150 సిటీ బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను నేడు, రేపు ప్రత్నామ్నాయ మార్గాల గుండా మళ్లిస్తున్నారు.