Errabelli: మోదీ ఏ మొహం పెట్టుకొని వరంగల్ వచ్చారు?: మంత్రి ఎర్రబెల్లి నిప్పులు

Errabelli lashes out at PM Modi

  • మోదీ శంకుస్థాపనకు వచ్చారా? లేక రాజకీయం చేయడానికి వచ్చారా? అన్న మంత్రి 
  • విభజన హామీలు నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • వరంగల్ కు ఏం చేశారో చెప్పాలని నిలదీత

ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడానికి తెలంగాణకు వచ్చారా? లేక రాజకీయం చేయడానికా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిప్పులు చెరిగారు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎర్రబెల్లి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుండి ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుండి తెలంగాణపై వ్యతిరేకతను నింపుకున్నారని ఆరోపించారు.

విభజన హామీలు నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసలు తెలంగాణకు మోదీ ఏం చేశారని నిలదీశారు. కనీసం వరంగల్‌కు ఏం చేశారో చెప్పకుండా కేసీఆర్‌ను తిట్టడానికే వచ్చినట్లుగా ఉందన్నారు. కాజీపేటకు రిపేర్‌ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ తీసుకెళ్లారని ఆరోపించారు. వరంగల్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం హామీపై ప్రశ్నించారు.

ఢిల్లీలో అవార్డులు ఇచ్చి ఇక్కడకు వచ్చి ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వల్లే తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కేసీఆర్ పథకాలను కాపీ కొట్టి, దేశవ్యాప్తంగా పేర్లు మార్చి పెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాల మాటేమిటన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ ఆ ఆలయానికి ఏం చేశారో చెప్పాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Errabelli
Narendra Modi
Telangana
Warangal Urban District
KCR
BJP
BRS
  • Loading...

More Telugu News