West Bengal: బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకం, 11 మంది మృతి

11 Dead In Violence As Bengal Votes For Panchayat Polls

  • తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కార్యకర్తల మృతి
  • పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన ఘటనలు  
  • పోలింగ్ సిబ్బందిపై దాడి చేసిన ఆయా పార్టీల కార్యకర్తలు
  • గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం

పశ్చిమ బెంగాల్ లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు. భద్రత కల్పించడంలో కేంద్ర బలగాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తృణమూల్ ఆరోపించింది. రాష్ట్రంలో చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారు. 

ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. కొన్నిచోట్ల వాటిని తగులబెట్టారు. వివిధ పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్ లలోకి వెళ్లి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేలమంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, హింసలో గాయపడిన ప్రజలను కలిశారు. ఓటర్లతోనూ సంభాషించారు.

West Bengal
Gram Panchayat Elections
  • Loading...

More Telugu News