Team India: ఆసియా క్రీడలకు రోహిత్, కోహ్లీ, పాండ్యా దూరం

No star players for in Indias Asian Games squad

  • ప్రపంచ కప్‌ లో ఆడని ఆటగాళ్లనే ఆసియా క్రీడలకు పంపనున్న బీసీసీఐ
  • ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగింపు
  • ఇకపై ఓవర్‌‌ కు రెండు బౌన్సర్లు అనుమతించాలని బీసీసీఐ నిర్ణయం

భారత ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్‌లలో పాల్గొనడానికి బీసీసీఐ త్వరలోనే ఒక విధానాన్ని రూపొందించనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బీసీసీఐ 19వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లతో పాటు  రిటైర్డ్ ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనే విషయంతో పాటు అనేక అంశాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడలకు పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, స్వదేశంలో పురుషుల వన్డే ప్రపంచ కప్, ఆసియా క్రీడల షెడ్యూల్ ఒకే సమయంలో ఉన్న నేపథ్యంలో ప్రపంచ కప్ లో పాల్గొనని ఆటగాళ్లను మాత్రమే ఆసియా క్రీడలకు పంపించాలని నిర్ణయించింది. 

అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, సిరాజ్ తదితర స్టార్ క్రికెటర్లు ఆసియా క్రీడల్లో పాల్గొనరు. వచ్చే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా బీసీసీఐ కొన్ని మార్పులను ప్రకటించింది. గత ఐపీఎల్‌ సీజన్‌ లో ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఈ ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాట్, బాల్ మధ్య పోటీని సమతుల్యం చేయడానికి రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓవర్‌కు రెండు బౌన్సర్లను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. వీటితో పాటు దేశంలో క్రికెట్ స్టేడియాలను రెండు దశల్లో అప్ గ్రేడ్ చేయనుంది. మొదటి దశలో ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలను అప్‌ గ్రేడ్ చేసి టోర్నీ ముగిసిన తర్వాత రెండో దశలో మిగతా స్టేడియాల్లో వసతులు కల్పించాలని నిర్ణయించింది.

More Telugu News