Herbal Products Scam: రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కామ్ వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ
- దేశవ్యాప్తంగా 7 వేల మందికి కుచ్చుటోపీ
- స్కీముల పేరిట జనాలకు వల
- నిజమే అని నమ్మి భారీగా డబ్బులు కట్టిన ప్రజలు
- ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు... పరారీలో ఇద్దరు మహిళలు
ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా నడుస్తున్న రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బట్టబయలైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు తెలిపారు.
వనమూలికలతో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల పేరిట ఈ ముఠా దేశం మొత్తమ్మీద దాదాపు 7 వేల మందికి టోకరా వేసిందని వెల్లడించారు. నెలవారీ చెల్లింపుల పేరిట అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారని వివరించారు. ఇందుకోసం పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టారని తెలిపారు.
"పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్ ప్రకారం రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్ ప్రకారం రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు.
ఐడీ స్కీమ్ అని మరొకటి ఉంది. దీంట్లో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇలాంటి పేమెంట్లే కాదు... కార్లు, ఫ్లాట్లు, విహారయాత్రలు, బైకులు, ల్యాప్ టాప్ లు, నగలు కూడా కానుకలుగా ఇస్తామని ప్రజలను నమ్మించారు.
వీరి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో జనాలు భారీగా డబ్బులు కట్టి స్కీమ్ లలో చేరారు. క్యూ మార్ట్ మోసాల కేసు దర్యాప్తు చేస్తుంటే, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బయటపడింది.
ఈ కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. పూజా కుమారి, షకీలా అనే మహిళలు పరారీలో ఉన్నారు" అని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.