Cricket: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ నే ఎందుకు ఎంపిక చేశారంటే..!
- టీ20లు ఆడిన అనుభవంతో పాటు యువ అభ్యర్థిత్వం వైపు బీసీసీఐ మొగ్గు
- గతంలో ముంబై క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా పని చేసిన అగార్కర్
- ఆటగాళ్ల బలాబలాలను అంచనావేయడంలో దిట్ట
- చీఫ్ సెలెక్టర్ ఎంపికలో పారితోషికం కూడా కీలకమే!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. వరుసగా ఆసియా కప్, ప్రపంచ కప్, వంటి టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగార్కర్ ఎంపికకు వివిధ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
వన్డే ప్రపంచ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ జట్లను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీ20లు ఆడిన అనుభవంతో పాటు ఈసారి చీఫ్ సెలెక్టర్ గా యువ అభ్యర్థిత్వం ఉంటే బాగుంటుందని బీసీసీఐ భావించింది.
అగార్కర్ గతంలో కామెంటరీతో పాటు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. సెలెక్టర్ గాను అతనికి ఇదే మొదటిది కాదు. గతంలో ముంబై క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ గా పని చేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీకి సహాయక కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.
క్రికెట్ విశ్లేషకుడిగా అనుభవం ఉంది. ఆటను సునిశితంగా పరిశీలిస్తాడు. అగార్కర్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 349 వికెట్లు తీశాడు. అన్ని విభాగాలపై పట్టు ఉంది. ఆటగాళ్ల బలాబలాలను అంచనా వేయడంలో దిట్ట.
చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అగ్రశ్రేణి ఆటగాళ్ల వైపు బీసీసీఐ వెళ్లకపోవడానికి పారితోషికం కూడా మరో ప్రధాన అంశంగా చెబుతున్నారు. చీఫ్ సెలక్టర్ గా ఎంపికైన వారికి ప్రస్తుతం రూ.1 కోటి వేతనం ఉంటుంది. మాజీ అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. అగార్కర్ కూడా విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా ఇంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు. దీంతో వేతన ప్యాకేజీని రూ.3 కోట్లకు పెంచేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది.
అగార్కర్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ఒక క్రికెట్ లెజెండ్ అగార్కర్ ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి కోసం అగార్కర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని సమాచారం. దీంతో క్రికెట్ సలహా కమిటీ అగార్కర్ ను మాత్రమే ఇంటర్వ్యూ చేసి, అతని అనుభవం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసింది.