Anantha Sriram: వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఆ పోస్టులతో నాకు సంబంధం లేదు: లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్

Anantha Sriram clarifies on rumors

  • తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న అనంత శ్రీరామ్
  • వైఎస్సార్ వ్యతిరేక పోస్టుల వెనుక తాను ఉన్నట్టు వదంతులు వస్తున్నాయని  వెల్లడి
  • తనకు అన్ని రాజకీయ పార్టీలు సమానం అని స్పష్టీకరణ
  • నాటా సభల కోసం అమెరికాలో ఉన్నానని చెప్పిన అనంత శ్రీరామ్
  • హైదరాబాద్ తిరిగొచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టీకరణ

టాలీవుడ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఓ వివాదంలో చిక్కుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. 

సోషల్ మీడియాలో పొలిటికల్ మిస్సైల్ అనే ఖాతాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా, ఆయనను అవమానించేలా కొన్ని పోస్టులు పెట్టారని, అయితే ఆ పోస్టుల్లోని రాతల వెనుక ఉన్నది తానే అని ప్రచారం జరుగుతోందని అనంత శ్రీరామ్ విచారం వ్యక్తం చేశారు. ఆ రాతలకు తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. 

తనకు అన్ని పార్టీలు సమానమేనని, అన్ని పార్టీల వారికి తాను పాటలు రాస్తానని వెల్లడించారు. పాటలు రాయడం తన వృత్తి అని, ఏ పార్టీ మీదా తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం లేదని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయాలని అనుకున్నా, నిక్కచ్చిగా, నిర్భయంగా చెబుతానని అన్నారు. అది కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడిస్తానే తప్ప, ఇలా వేరే పేర్లు పెట్టుకున్న సోషల్ మీడియా ఖాతాల నుంచి వెల్లడించబోనని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం తాను నాటా మహాసభల కోసం అమెరికాలో ఉన్నానని, హైదరాబాద్ తిరిగొచ్చాక ఈ సోషల్ మీడియా దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని అనంత శ్రీరామ్ వెల్లడించారు.

Anantha Sriram
Social Media
YSR
Political Missile
  • Loading...

More Telugu News