Vnukovo Airport: మాస్కో ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి... ఇది కూడా ఉక్రెయిన్ పనే అంటున్న రష్యా
- గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- రష్యా కీలక స్థావరాలపైనా అప్పుడప్పుడు దాడులు జరుగుతున్న వైనం
- ఉక్రెయిన్ వైపే వేలెత్తి చూపుతున్న రష్యా
- తాజాగా నుకోవో ఎయిర్ పోర్టుపై 5 డ్రోన్లతో దాడి
- అన్ని డ్రోన్లను కూల్చివేసిన రష్యా బలగాలు
గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు సజావుగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు రష్యా అధీనంలోని భూభాగాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. క్రెమ్లిన్ అధ్యక్ష భవనాలపైకి కూడా డ్రోన్లు దూసుకొచ్చాయి. వీటన్నింటికి ఉక్రెయినే కారణమని రష్యా ఆరోపిస్తోంది.
తాజాగా, మాస్కోలోని నుకోవో ఎయిర్ పోర్టుపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తం 5 డ్రోన్లు పాల్గొన్నాయి. మూడు డ్రోన్లను మాస్కోలో కూల్చివేశారు. కలుగ్రా వద్ద మరో డ్రోన్ ను కూల్చివేశారు. కుబ్నికా పట్టణం వద్ద మరో డ్రోన్ ను కూల్చివేశారు. వీటిలో 4 డ్రోన్లను రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు పేల్చివేయగా, మరో డ్రోన్ ను ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర వ్యవస్థ పేల్చివేసింది.
దీనిపై రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. నేరుగా ఉక్రెయిన్ వైపే వేలెత్తి చూపింది. ప్రజా కార్యకలాపాలు నడిచే ప్రదేశంపై కీవ్ పాలకులు దాడికి దిగారని మండిపడింది. నిత్యం అంతర్జాతీయ విమాన రాకపోకలు జరిగే ఎయిర్ పోర్టుపై దాడి ఒక కొత్త ఉగ్రవాద చర్య అని పేర్కొంది.
దాడి నేపథ్యంలో నుకోవో ఎయిర్ పోర్టును 4 గంటల పాటు మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. డ్రోన్ల కూల్చివేత అనంతరం పరిస్థితిని సమీక్షించి విమానాశ్రయంలో కార్యకలాపాలను పునరుద్ధరించారు.