peddha kapu: ఊరు, ఆధిపత్యం, వర్గాల ‘పెదకాపు’.. ఆసక్తికరంగా టీజర్!
- మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘పెదకాపు’ను సిద్ధం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల
- టీజర్‌లో కనిపించిన నాగబాబు, రావు రమేష్, అనసూయ, శ్రీకాంత్ అడ్డాల
- ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు సినిమా
ఫ్యామిలీ డ్రామాతో ఆకట్టుకునే చిత్రాలను అందించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఈ సారి ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ‘నారప్ప’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద కాపు 1’. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా టీజర్ ప్రారంభమైంది. అడవిలో పెద్ద చెట్టును నరికి యువకులు దాన్ని మోసుకురావడం, కొంతమందిని ప్రాణాలతోనే ఊరి మధ్యలో పాతి పెట్టడం వంటి సన్నివేశాలను చూపించారు. శ్రీకాంత్ అడ్డాల గత సినిమా ‘నారప్ప’ను ఈ చిత్రంలో గుర్తు చేశారు. ఊరు, ఆధిపత్యం, వర్గాలు వంటివి కనిపించాయి.
టీజర్‌లో నాగబాబు, రావు రమేష్, ఈశ్వరి రావు, అనసూయ వంటి భారీ తారాగణాన్ని చూపించారు. టీజర్ ఆఖర్లో హీరో తన తండ్రి గురించి చెబుతుండగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని చూపిస్తారు. ఆయన కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.
‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 18న ‘పెదకాపు 1’ ప్రేక్షకుల ముందుకు రానుంది.