Vande Bharat Mission: వందేభారత్‌ను పాత రైలింజన్ లాక్కెళ్లడంపై సెటైర్లు.. రైల్వే శాఖ స్పందన
- ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ ను పాత ఇంజిన్ లాక్కెళ్తోందంటూ విమర్శలు
- 9 ఏళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్తోందని కాంగ్రెస్ నేత సెటైర్
- విమర్శలపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే శాఖ స్పందన
- ప్రారంభం కాని వందే భారత్ రైలు అని స్పష్టం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ ఇంజిన్ లాక్కెళ్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వందే భారత్ మొరాయించడంతో దీనిని పాత ఇంజిన్ లాక్కెళ్తోందని, ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్ల వాస్తవ పరిస్థితి ఇదీ అంటూ కొందరు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణ కూడా దీనిని షేర్ చేస్తూ, తొమ్మిదేళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్తోందంటూ ట్వీట్ చేశారు. హైస్పీడ్ రైళ్లంటూ ఊదరగొట్టారని, చివరకు కాంగ్రెస్ తెచ్చిన ఇంజిన్లే దిక్కయ్యాయంటూ పలువురు ట్వీట్ చేశారు. ఈ విమర్శలపై రైల్వే శాఖ స్పందించింది.
ఈ వీడియోపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందిస్తూ... ఇది ఇంకా ప్రారంభం కాని వందే భారత్ రైలు అని స్పష్టం చేసింది. రూట్ కూడా ఖరారు కాలేదని, ఒకసారి రూట్ ఖరారైతేనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపింది. ఈ వీడియోను యూపీకి చెందిన శశాంక్ అనే వ్యక్తి సకల్ దిహా రైల్వే స్టేషన్ సమీపంలో తీశాడు. చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి పాట్నా తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ప్రారంభం కాని వందే భారత్ ను ఇంజిన్ లాక్కెళ్తుండటంతో దీనిని మరోవిధంగా అర్థం చేసుకున్నవారు విమర్శిస్తూ ట్వీట్ చేశారు.