Vasireddy Padma: సీఎం కుటుంబ మహిళలపై నీచమైన పోస్టులు పెట్టిన శ్వేతా చౌదరికి చంద్రబాబు మద్దతా?: వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma press meet

  • మహిళలపై ట్రోలింగ్ చేసేవారికి చంద్రబాబు అండగా నిలుస్తున్నారంటూ పద్మ ఆగ్రహం
  • చంద్రబాబు తీరు తప్పుడు సంకేతాలు ఇస్తోందని వ్యాఖ్య 
  • సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై జులై 5న సదస్సు

అమరావతిలోని సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్ఠగా పోస్టులు, ట్రోలింగులతో రెచ్చిపోతున్న వారికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. 

శ్వేతా చౌదరి అనే మహిళ స్వాతి రెడ్డి పేరుతో సీఎం జగన్ కుటుంబ మహిళలపై భరించలేని, చెప్పలేని పోస్టింగులు పెట్టారని, ట్రోల్ చేశారని ఆరోపించారు. ఆమె ఉండేది ఆధునిక దేశం యూకేలో... బుద్ధి మాత్రం పాతాళంలో... అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు చంద్రబాబు దన్నుగా నిలుస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఇలాంటి జుగుప్సాకర యుద్ధాలకు కాలు దువ్వే వారిని చంద్రబాబు సమర్థించటం ఎటువంటి సంకేతాలను ఇస్తుంది? శ్వేతా చౌదరి పెట్టిన సోషల్ మీడియా పోస్టులకు గడ్డి పెట్టవలసింది పోయి ప్రోత్సహించడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళా కమిషన్ కూడా ఆమెకు మద్దతు పలకాలట...... చివరకు ఏం జరిగింది..? ఆమె అదే సోషల్ మీడియా బాధితురాలిగా మారింది" అని వాసిరెడ్డి పద్మ వివరించారు. 

మహిళలపై హీనాతి హీనమైన పోస్టులు పెట్టినప్పుడు వాటిపై కఠిన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. "సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు ఉండరాదని న్యాయస్థానాలు చెబుతున్నాయని పోలీసులు అంటున్నారు. చట్టపరమైన చర్యలు లేకపోవడంతో ఇరువైపులా మోహరించి దారుణమైన పోస్టులతో యుద్ధాలు చేస్తున్నారు. కానీ బలవుతోంది మహిళలే. 

'ల'కారాలు, 'ము'కారాల తిట్లు, అక్రమ సంబంధాల గాలి కథలు, నీచమైన ట్రోలింగ్ లు ఇవి ప్రమాదకరమైన నేరాలు కావా...? వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టలేమా...? అదుపు తప్పుతున్న సోషల్ మీడియాను కట్టడి చేయలేమా...? దీనిపై అందరం మాట్లాడదాం. అవసరమైన సూచనలు అన్ని వ్యవస్థలకు చేద్దాం. ఇందుకోసం రాష్ట్ర మహిళా కమిషన్ జులై 5న విజయవాడలో ఒక సెమినార్ నిర్వహించి కార్యచరణ రూపొందిస్తుంది" అని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

Vasireddy Padma
Chandrababu
Shwetha Chowdary
Swathi Reddy
Social Media
YSRCP
TDP
  • Loading...

More Telugu News