Pawan Kalyan: ఇవాళ తోట సుధీర్ తో పాటు వచ్చిన 150 మంది ఒక సైన్యంలా పనిచేస్తారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan welcomes Thota Sudheer into Janasena party

  • భీమవరంలో పార్టీ చేరికల కార్యక్రమం
  • పవన్ సమక్షంలో జనసేనలో చేరిన కాకినాడ న్యాయవాది తోట సుధీర్
  • సుధీర్ తో పాటు ఆయన మద్దతుదారులకు సాదర స్వాగతం పలికిన పవన్
  • కచ్చితంగా కాకినాడలో జెండా ఎగరేస్తామన్న జనసేనాని

కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తోట సుధీర్ ఇవాళ తన మద్దతుదారులతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తోట సుధీర్ కు పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, చట్టంపై పట్టు, విలువలు ఉన్న వ్యక్తి తోట సుధీర్ అని కొనియాడారు. సుధీర్ వంటి నేతలు పార్టీలోకి రావడం కాకినాడలో రౌడీలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రోజు తోట సుధీర్ తో పాటు జనసేనలోకి వచ్చిన 150 మంది నాయకులు ఒక సైన్యంలా పనిచేస్తారని, వారి వెనుక ఎంతోమంది ఉన్నారని పవన్ పేర్కొన్నారు. 

కచ్చితంగా కాకినాడలో జనసేన జెండా ఎగరేస్తామని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగించేలా కాకినాడలో ఒక కుటుంబం వద్ద వ్యవస్థలు ఉన్నాయని, అటువంటి వారి నుంచి రైతులను కాపాడడానికి న్యాయవ్యవస్థపై పట్టు ఉన్న తోట సుధీర్ వంటి వారు ఉపయోగపడతారని పవన్ కల్యాణ్ వివరించారు. 

"నా దేశం, నా రాష్ట్రం బాగుపడాలి అనుకునే వ్యక్తిని నేను. అందుకే తోట సుధీర్ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవాడ్ని. నా ఒక్కడి స్వార్థం అయితే ఏదో ఒక పదవి తీసుకుని ఉండేవాడ్ని. సుధీర్ వంటి వ్యక్తులు ఇవాళ పార్టీలోకి రావడం వల్ల... నేను రెండు చోట్ల ఓడిపోయినా సరే మార్పును కాంక్షించే వ్యక్తులు ఉన్నారు అనే నమ్మకం కలుగుతోంది... ఆ నమ్మకమే నన్ను నడిపిస్తోంది" అని పవన్ పేర్కొన్నారు.

More Telugu News