bhim army: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు, ఆసుపత్రికి తరలింపు
- సహ్రాన్ పూర్‌లో అనుచరుడి ఇంటికి వెళ్లి వస్తుండగా ఘటన
- ఓ తూటా తగిలిందని.. పరిస్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడి
- ఘటనపై పోలీస్ దర్యాఫ్తు కొనసాగుతుందని చెప్పిన పోలీస్ అధికారి
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్ పూర్ లో తన అనుచరుడి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వస్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తూటా తగిలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి విపిన్ టాడా మాట్లాడుతూ... చంద్రశేఖర్ కాన్వాయ్ పై కొందరు కారులో వెళ్తూ కాల్పులు జరిపినట్లు చెప్పారు. దీంతో ఓ తూటా తగిలిందని, అతని పరిస్థితి బాగానే ఉందన్నారు. చికిత్స నిమిత్తం సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించామని, ఘటనపై పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.
హర్యానా లైసెన్స్ నెంబర్ ప్లేట్ కలిగిన కారులో వచ్చిన దుండగులు చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో టయోటా ఫార్చ్యునర్ కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని సీటు, డోర్ పై బుల్లెట్ తగిలినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు సమీపంలోకి దూసుకు వచ్చి పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
తనపై హత్యాయత్నం గురించి చంద్రశేఖర్ ఆసుపత్రిలో వైద్యులకు వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తులను తాను సరిగ్గా గుర్తించలేదని, తన మనుషులు గుర్తుపట్టారన్నారు. తాము కారులో వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు రన్నింగ్‌లోనే తనపై కాల్పులు జరిపారని, దీంతో తాము వెంటనే యూ టర్న్ తీసుకున్నామని, వాళ్ల కారు సహరాన్‌పూర్ వైపు వెళ్లిందన్నారు. ఘటన జరిగిన సమయంలో తాను, తన తమ్ముడు సహా ఐదుగురం కారులో ఉన్నట్లు చెప్పారు.