Heavy Rains: ముంబయిలో వర్ష బీభత్సం... వరద గుప్పిట్లో పలు ప్రాంతాలు
- ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- గత రాత్రి నుంచి భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం
- జలమయం అయిన రోడ్లు... నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
- ముంబయి, థానే ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ కాస్త ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ముంబయిలో ప్రవేశించిన కొన్నిరోజులకే రుతుపవనాల ప్రభావం మొదలైంది. భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి.
గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అంధేరీ సబ్ వే నీట మునిగింది. గోరేగావ్, విలేపార్లే, లోయర్ పారెల్ ప్రాంతాల్లోనూ వర్షబీభత్సం కనిపించింది. థానేలో రహదారులు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. బోరివెలి వెస్ట్, ఎస్వీ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది.
నగరంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ముంబయిలో ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గరిష్ఠంగా 98 మి.మీ వర్షపాతం నమోదైంది. థానేలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 105 మి.మీ వర్షపాతం నమోదైంది.
అటు, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ముంబయి, థానే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.