Andhra Pradesh: ఏపీలో పదిరోజుల పాటు పండుగలా అమ్మ ఒడి.. సీఎం జగన్
- మన్యం జిల్లా కురుపాంలో బహిరంగ సభ
- అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి
- నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.66 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి
- లంచాలకు వివక్షకు చోటివ్వకూడదనే నేరుగా నిధుల జమ
- బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు చెప్పాలని వ్యంగ్యం
రాబోయే తరాల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే జగనన్న అమ్మ ఒడి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ప్రపంచ స్థాయిలో మన పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దేందుకు, ప్రపంచాన్ని ఏలే స్థాయిలో వారిని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలోనే అమ్మ ఒడి అమలవుతోందన్నారు.
అవినీతికి, వివక్షకు తావులేకుండా ఎక్కడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరంలేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని బటన్ నొక్కడమంటే తెలియని బడుద్ధాయిలకు చెప్పాలని అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని మాట్లాడారు. ఈ వేదికపైనే జగనన్న అమ్మ ఒడి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగం ప్రారంభించారు.
నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయని జగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులతో పోటీపడేలా తీర్చిదిద్ధిన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్ కరికులమ్, ఆరో తరగతి నుంచే క్లాసును డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు.
స్కూళ్లు ప్రారంభమైన వెంటనే విద్యాకానుక కిట్లను అందజేశామని గుర్తుచేశారు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్లుగా తయారుకావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేస్తోందని తెలిపారు. పిల్లల మేనమామగా వారి భవిష్యత్తు కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధమేనని జగన్ తేల్చిచెప్పారు. నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.66,722 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ, విద్యార్థులకు ట్యాబ్ లు అందజేస్తునట్లు వివరించారు. తొలిసారిగా విద్యార్థులకు బైలింగువల్ పుస్తకాలు అందజేస్తున్నామని, జగనన్న విద్యాదీవెన కింద ఫీజు 100 శాతం రీయింబర్స్ చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.26,067 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశామని జగన్ వివరించారు. విదేశాల్లోని యూనివర్సిటీలలో సీటు తెచ్చుకున్న విద్యార్థికి రూ.1.25 కోట్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.