Yadadri Bhuvanagiri District: ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 8 లక్షలు పోగొట్టుకున్న మహిళ.. పిల్లలతో కలిసి సంపులో దూకి ఆత్మహత్య
- అప్పు తెచ్చి గేమ్‌లో పెట్టి నష్టపోయిన మహిళ
- డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీసిన బంధువు
- మనస్తాపంతో సంపులో పిల్లల్ని తోసి, ఆపై తానూ దూకి ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 8 లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలైన మహిళ ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య రాజేశ్వరి (28), కుమారులు అనిరుధ్ (5), హర్షవర్ధన్ (3)తో కలిసి చౌటుప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో నివసిస్తున్నాడు.
ఆన్‌లైన్ గేమ్ ఆడే అలవాటున్న రాజేశ్వరి తెలిసిన వ్యక్తులు, బంధువుల నుంచి అప్పు తెచ్చి గేమ్‌లో పెట్టి ఏడాదిలో రూ. 8 లక్షలు నష్టపోయింది. తన డబ్బులు ఇవ్వాలంటూ నిన్న సాయంత్రం ఆమె బంధువు ఒకరు వచ్చి నిలదీశారు. స్థలం విక్రయించి అప్పు తీర్చేస్తానని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అప్పుడు ఇంట్లోనే ఉన్న భర్త పనిపై బయటకు వెళ్లగా, డబ్బుల కోసం వచ్చిన వ్యక్తి కాసేపు ఉండి వెళ్లిపోయాడు.
ఈ ఘటనతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో తన ఇద్దరు కుమారులను పడేసి, ఆపై తను కూడా దూకేసి ప్రాణాలు తీసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన మల్లేశ్ భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. సంపు మూత తీసి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా లోపల ముగ్గురూ కనిపించారు. వెంటనే వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.