Posters: వైసీపీ పాలనే టార్గెట్... 'నాలుగేళ్ల నరకం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోస్టర్లు
- వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ దండయాత్ర
- రెండోరోజు పోస్టర్లతో ప్రచారం
- అందరూ ఈ ప్రచారంలో పాల్గొనాలన్న టీడీపీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'నాలుగేళ్ల నరకం' ప్రచార కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతోంది. రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి.
ప్రధానంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో సహా పోస్టర్లపై ముద్రించారు. గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ వంటి కీలక ప్రాంతాలలో ఈ పోస్టర్లు అంటించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల సంఖ్య, వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులు, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, బహుళజాతి కంపెనీల తరలింపు, నిరుద్యోగం వంటి కొన్ని ప్రధాన అంశాలు పోస్టర్‌లపై హైలైట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని చెబుతూ పోస్టర్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో చర్చను తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. రానున్న రోజుల్లో నాలుగేళ్ల నరకం అనే ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో కూడా భాగస్వాములు కావాలని టీడీపీ పిలుపునిచ్చింది. #NalugellaNarakam అనే హ్యాష్‌ట్యాగ్ విస్తృతంగా షేర్ చేయాలని కోరింది