Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత హింసాత్మక ఘటనలు.. ముగ్గురు కీలక అధికారులకు ఉద్వాసన
- హింసాత్మక ఘర్షణలు చెలరేగకుండా నిరోధించడంలో విఫలమైనందుకు చర్యలు
- ముగ్గురు మేజర్ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లపై వేటు
- 102 మందిపై మిలటరీ కోర్టుల్లో విచారణ
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత హింసాత్మక ఘర్షణలు చెలరేగకుండా నిరోధించడంలో విఫలమైనందుకు లెఫ్టినెంట్ జనరల్ సహా ముగ్గురు అత్యున్నతస్థాయి అధికారులను పదవుల నుంచి తొలగించామని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి సోమవారం ప్రకటించారు. ముగ్గురు మేజర్ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్నందుకు మొత్తం 102 మంది ప్రస్తుతం మిలటరీ కోర్టుల్లో విచారణలో ఉన్నారని మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అర్షద్ షరీఫ్ తెలిపారు. మేజర్ జనరల్స్, బ్రిగేడియర్‌లతో సహా మరో పదిహేను మంది ఆర్మీ అధికారులపై కూడా కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రెండు వేర్వేరు ఆర్మీ విచారణలు పూర్తయిన తర్వాత శిక్షలు విధించినట్లు తెలిపారు. అయితే తొలగించిన సీనియర్ అధికారుల పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
'ఒక లెఫ్టినెంట్ జనరల్ సహా ముగ్గురు అధికారులను తొలగించడం జరిగింది. ముగ్గురు మేజర్ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లు సహా ఇతర అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం' అని చెప్పారు.