Yevgeny Prigozhin: పుతిన్ పగబట్టాడంటే వదలడు... వాగ్నర్ గ్రూపు అధిపతికి జాగ్రత్తలు చెప్పిన సీఐఏ
- పుతిన్ అండతో ఎదిగిన ప్రిగోజిన్
- వాగ్నర్ గ్రూపుతో రష్యా సైనిక చర్యల్లో కీలకపాత్ర
- ఇటీవల రష్యా సైన్యంపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు
- రాజీ కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు
- పుతిన్ హిట్ లిస్టులో ప్రిగోజిన్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ ఇటీవల తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే రాజీమార్గంలో రక్తపాతం లేకుండా తిరుగుబాటు నిలిచిపోయినప్పటికీ, ప్రిగోజిన్ బెలారస్ దేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీనిపై అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ స్పందించారు. పుతిన్ ఒక్కసారి పగబట్టాడంటే వదిలిపెట్టడని స్పష్టం చేశారు. గతంలో పుతిన్ విరోధులు తెరిచి ఉంచిన కిటికీల్లోంచి కింద పడి మరణించిన ఘటనలు జరిగాయని, ప్రిగోజిన్ కూడా తెరిచి ఉంచిన కిటికీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెట్రాయస్ హెచ్చరించారు.
ఆవేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ఆ తర్వాత వెనక్కి తగ్గి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ తాను బెలారస్ వెళ్లిపోయి వాగ్నర్ గ్రూపును దూరం చేసుకున్నాడని వివరించారు. బెలారస్ వంటి కొత్త ప్రదేశంలో తెరిచి ఉంచిన కిటికీల వద్ద ప్రిగోజిన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలయ్యాక రష్యాకు చెందిన 19 మంది ప్రముఖ వ్యక్తులు, బిజినెస్ టైకూన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు కిటికీలోంచి కిందపడి చనిపోయినవారే. రష్యా ప్రభుత్వ వర్గాలు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా పేర్కొంటున్నప్పటికీ, పుతిన్ కు ఎదురు నిలిస్తే ఇలాంటి మరణమే సంభవిస్తుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.