Maharashtra: బీఫ్ తరలిస్తున్నాడన్న అనుమానంతో ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు
- మహారాష్ట్రలో ఘటన
- కారును ధ్వంసం చేసి బాధితులను చావబాదిన నిందితులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి
- పోలీసుల అదుపులో పదిమంది
బీఫ్ (గొడ్డు మాంసం)ను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని శనివారం రాత్రి కొంతమంది గోరక్షకులు కొట్టి చంపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిందీ దారుణం. ముంబై కర్లాకు చెందిన అఫన్ అన్సారీ (32) తన స్నేహితుడు నాసిర్ షేక్‌తో కలిసి కారులో మాంసం తీసుకుని వెళ్తుండగా గోరక్షకులు అడ్డుకుని బయటకు లాగి దారుణంగా చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందాడు.
ఘటనా స్థలానికి వెళ్లిన తమకు ధ్వంసమైన కారు కనిపించిందని, తీవ్రంగా గాయపడి కారులో ఉన్న ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ అనే వ్యక్తి మరణించారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు తరలిస్తున్న మాంసం బీఫా? కాదా? అనేది ల్యాబ్ పరీక్షల అనంతరం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.