: ప్రధానికి జయ ఘాటు లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖాస్త్రం సంధించారు. రేపు ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి తాను హాజరుకాబోనని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎంలు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడంలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రుల ప్రసంగాలను కుదిస్తుండడంతో, నిర్దేశిత సమయంలోనే అన్ని అంశాలను ప్రస్తావించడం సాధ్యంకాదని తెలిపారు. సమావేశంలో 12 అంశాలపై చర్చ అజెండాగా ఉందని.. ఆయా అంశాల పేర్లు ఉచ్చరించడానికే 10 నిమిషాలు పడుతోందని, ఇక వాటిపై అభిప్రాయాలు చెప్పేందుకు తగిన వ్యవధి ఎక్కడుంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తాము కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానమే అని జయ పేర్కొన్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ సమావేశాన్ని తూతూమంత్రంగా నిర్వహించడం సబబుకాదని ఆమె విమర్శించారు. ఇలాంటి సమావేశానికి తాను హాజరుకాబోవడంలేదని, తన తరుపున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేపీ మునుస్వామి ప్రసంగాన్ని చదవుతారని లేఖలో వెల్లడించారు.