JP Nadda: తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడింది: జేపీ నడ్డా

JP Nadda attends BJP Nav Sankalp Sabha in Nagar Kurnool
  • నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ
  • హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్
  • తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరన్న నడ్డా
  • తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని విమర్శలు
  • బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ... తెలంగాణలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. 

తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేశారని తెలిపారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని, అది కేసీఆర్ కుటుంబం అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 

తెలంగాణకు ప్రధాని మోదీ భారీగా నిధులు ఇచ్చారని జేపీ నడ్డా వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బలహీనవర్గాల అభివృద్ధికి మోదీ అనేక చర్యలు చేపట్టారని వివరించారు. మోదీ పాలనలో దేశం పురోగామి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ది సాధ్యం అని నడ్డా ఉద్ఘాటించారు. 

ప్రధాని మోదీ పాలనలో పేదరికం తగ్గిపోయిందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. 

ప్రపంచదేశాలతో పోల్చితే భారతదేశ ఆర్థికవ్యవస్థ దూసుకువెళుతోందని నడ్డా స్పష్టం చేశారు. మోదీ గ్లోబల్ లీడర్ అని ప్రపంచం కొనియాడుతోందని వివరించారు. మోదీని అందరూ పొగుడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం జీర్ణించుకోలేకపోతోందని నడ్డా విమర్శించారు. భారత ప్రజలంతా మోదీ వెంటే ఉన్నారని తెలిపారు.
JP Nadda
BJP Nav Sankalp Sabha
Nagar Kurnool
Telangana

More Telugu News